ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు సంపూర్ణ మద్దతు.
న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్
వరంగల్,అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ నెల 13వ తేదీ నుంచి చేపట్టనున్న సమ్మెకు తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవేనని, ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాలని కోరారు.
రాష్ట్రంలో ఎన్‌హెచ్‌ఎం పరిధిలో సుమారు 17 వేల మంది ఉద్యోగులు వివిధ విభాగాల్లో పనిచేస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, ఇతర కాంట్రాక్ట్ సిబ్బంది ప్రజారోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు పొందుతున్న వేతనాలను పెంచడంతో పాటు తగిన ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఆరోగ్య బీమా, జీవిత బీమా సౌకర్యాలను వెంటనే కల్పించాలని కోరారు. విధి నిర్వహణలో ప్రమాదం జరిగినా, అనారోగ్యానికి గురైనా, దురదృష్టవశాత్తూ ఉద్యోగి మరణించినా వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఎన్‌హెచ్‌ఎం వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, ఇతర సిబ్బందిని వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.నేషనల్ హెల్త్ మిషన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలవుతున్న కార్యక్రమమని, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ ప్రభుత్వం కూడా పరిశీలించాలని సూచించారు.
ఏళ్ల తరబడి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో సేవలందిస్తున్న ఉద్యోగులను కేవలం కాంట్రాక్ట్ సిబ్బందిగా కొనసాగించడం సరికాదన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలపై స్పందించి, వారి ప్రతినిధులతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వినయ్ భాస్కర్ కోరారు.
వేతనాల పెంపు, ఇంక్రిమెంట్లు, బీమా సౌకర్యాలు, ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరణ తదితర న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపడుతున్న సమ్మెకు తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా వినతిపత్రం అందించిన వారిలో జేఏసీ అధ్యక్షుడు డా. మహేందర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ డా. భరత్, ప్రధాన కార్యదర్శి ఎండీ రుకముద్దీన్, కార్యవర్గ సభ్యులు నరేష్, వినోద్ తదితరులు ఉన్నారు.


Comments