మాకు న్యాయం చేయండి మహాప్రభో..!
మా భూమిలోకి వెళ్లే దారిని కబ్జా చేసి మూసివేశారు
కలెక్టర్, సీపీ గ్రీవెన్స్ సెల్‌కు రైతు ఫిర్యాదు
స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
“మా భూమిని కాపాడండి.. మా గోడును పట్టించుకోండి” అంటూ స్టేషన్ ఘన్‌పూర్ మండలం రాఘవపురం శివారులోని తమ వ్యవసాయ భూమి వివాదంపై వడ్డేపల్లికి చెందిన కల్వచర్ల విష్ణు బుధవారం విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిని పక్క భూమికి చెందిన వారు అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, తాజాగా వరంగల్ సీపీ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
విష్ణు తెలిపిన వివరాల ప్రకారం.. తమ తండ్రి కల్వచర్ల మొగిలి పేరుతో 2011లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న సర్వే నంబర్లు 292/సి, 292/ఏ1, 293/ఏ, 293/బి, 292/ఏ/అ, 292/ఏ/ఆలలో మొత్తం 9 ఎకరాల 29 గుంటల వ్యవసాయ భూమి ఉందన్నారు.
తమ వ్యవసాయ భూమికి వెళ్లేందుకు ఉన్న సుమారు 16 అడుగుల దారిని పక్క భూమికి చెందిన బోడ మమత ఆక్రమించి మూసివేశారని ఆరోపించారు. అంతేకాకుండా తమ భూమిలో సైతం వాటర్ ట్యాంక్‌తో పాటు ఇతర నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. నిర్మాణాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సమయంలో వారి సూపర్వైజర్ రేవల్లి శంకర్ దుర్భాషలాడుతూ దాడికి యత్నించారని విష్ణు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
తమ భూమి హద్దులు, దారికి సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు రెండు నెలల క్రితం మీ సేవ కేంద్రం ద్వారా సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు. సంబంధిత రెవెన్యూ అధికారులు స్పందించి భూమిని సర్వే చేసి, తమకు న్యాయం చేయడంతో పాటు భూమిని కాపాడాలని కల్వచర్ల విష్ణు వేడుకున్నారు.


Comments