విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఎం ఫైర్.
ట్రూ-అప్ పేరుతో దోపిడీకి యత్నం.. వెంటనే వెనక్కి తగ్గాలి
సీపీఎం చిల్పూర్ మండల కార్యదర్శి సాదం రమేష్
చిల్పూర్,అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు):
విద్యుత్ యూనిట్‌కు 30 నుంచి 50 పైసల వరకు ఛార్జీలు పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని సీపీఎం చిల్పూర్ మండల కార్యదర్శి సాదం రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ట్రూ-అప్ పేరుతో నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీల పెంపునకు సమాయత్తమవుతోందని రమేష్ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపు సామాన్య, పేద ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపుతుందని పేర్కొన్నారు.
ప్రజలపై రూ.2,215 కోట్ల భారం
ప్రతిపాదిత విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై రూ.2,215 కోట్లకు పైగా అదనపు భారం పడే అవకాశం ఉందని రమేష్ పేర్కొన్నారు. ఈ భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని, మరోవైపు ఉచిత పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతూ విద్యుత్ బిల్లుల రూపంలో అదనపు భారం మోపడం సరికాదన్నారు.
గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఎం నిర్వహించిన పోరాటంలో ముగ్గురు అమరులయ్యారని ఆయన గుర్తు చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే తెలుగుదేశం పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని హెచ్చరించారు.
విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోకపోతే ఎర్రజెండా ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని సాదం రమేష్ స్పష్టం చేశారు.


Comments