ప్రకృతి సేద్యమే మేలు!
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన
తాటికొండ రైతు వేదికలో శిక్షణ శిబిరం
స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు):
పంటలకు విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వల్ల భూమి నిస్సారంగా మారడంతో పాటు సాగు ఖర్చులు పెరిగి రైతులు నష్టపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించడమే శాశ్వత పరిష్కారమని సూచించారు.
ప్రధానమంత్రి కృషి వికాస్ యోజనలో భాగంగా మంగళవారం తాటికొండ రైతు వేదికలో తాటికొండ, కొత్తపల్లి, జిట్టేగూడెం గ్రామాల రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పంటలను ఆశించే చీడపీడలు, తెగుళ్లను నియంత్రించేందుకు రసాయన పురుగుమందులకు బదులుగా సహజ కషాయాలు, జీవ ఎరువులను ఎలా తయారు చేసుకోవాలి, వాటిని పంటలకు ఏ విధంగా వినియోగించాలి అనే అంశాలను శాస్త్రవేత్తలు రైతులకు ప్రత్యక్షంగా వివరించారు. పర్యావరణానికి హాని కలగకుండా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను వివరించారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకుని రైతులు మెరుగైన ఆదాయం పొందవచ్చని తెలిపారు. అనంతరం రైతులు అడిగిన పలు సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకురాలు అపర్ణ, మండల వ్యవసాయ అధికారి కరుణాకర్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ అరుణజ్యోతి, డాక్టర్ రాజు, మూడు గ్రామాల సర్పంచులు ముక్కెర స్వరూప రవి యాదవ్, మారపాక సుజానా శ్రీనివాస్, బలుబ్నాయక్, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రావణి, రాపోలు మధుసూదన్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.


Comments