జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం.
టైరు పగిలి సర్వీస్ రోడ్డులోకి దూసుకెళ్లిన ఇసుక లారీ.
స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు):
స్టేషన్ ఘనపూర్‌లో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. టైరు పగలడంతో అదుపుతప్పిన ఇసుక లారీ సర్వీస్ రోడ్డులోకి దూసుకెళ్లింది.భద్రాచలం నుంచి ఇసుక లోడ్‌తో హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ స్టేషన్ ఘనపూర్ వద్దకు చేరుకోగానే ముందు టైరు ఒక్కసారిగా పగిలింది. దీంతో లారీ అదుపుతప్పి జాతీయ రహదారిపై ఉన్న లైటింగ్ పోల్‌ను ఢీకొని సర్వీస్ రోడ్డులోకి దూసుకెళ్లింది.
అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో సర్వీస్ రోడ్డుపై వాహనాల రాకపోకలు, జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఈ ఘటనతో సర్వీస్ రోడ్డులో వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీని తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. లారీ ముందు టైరు పగలడమే ప్రమాదానికి కారణమని డ్రైవర్ తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.


Comments