రైతులకు కరెంటు కట్.. కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ ఫైర్.
వ్యవసాయానికి 6 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదు
విద్యుత్ కోతలపై కరీంనగర్–జగిత్యాల రహదారిపై బైఠాయించి నిరసన
12 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం: మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర , అక్టోబర్ 7(తెలంగాణ ముచ్చట్లు ):
రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకపోతే వారి ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకులు సుంకె రవిశంకర్ హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిజం చేస్తోందని విమర్శించారు.
నిత్యం జరుగుతున్న విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు, చొప్పదండి నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై ఆయన బైఠాయించి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్‌ను అందించిందని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి కనీసం ఆరు గంటల విద్యుత్‌ను కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదని మండిపడ్డారు.
ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉందని, ఈ సమయంలో పంటకు అధికంగా నీరు అవసరమవుతుందని తెలిపారు. విద్యుత్ కోతల కారణంగా సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలతో రైతులు పొలాలకు నిప్పు పెట్టుకునే పరిస్థితి వచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.
ఇకనైనా ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను కనీసం 12 గంటలు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


Comments