ఇండియా కూటమి ఎంపీల అరెస్టు అప్రజాస్వామికం.
ఓటు హక్కు కోసం ప్రశ్నిస్తే అరెస్టులా?
– స్టేషన్ ఘన్‌పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంబటి కిషన్ రాజు
స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
ఓటర్ల జాబితాల సవరణ పేరుతో దేశంలో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తే చూస్తూ ఊరుకోబోమని స్టేషన్ ఘన్‌పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంబటి కిషన్ రాజు అన్నారు. ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆయన ఖండించారు.లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇండియా కూటమికి చెందిన ఎంపీలను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.
“ఓటు అనేది కేవలం ఒక గుర్తు కాదు.. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం. ఓటు హక్కుపై అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘంపై ఉంది. ప్రశ్నించిన నాయకులను అరెస్టు చేయడం సమస్యకు పరిష్కారం కాదు” అని అంబటి కిషన్ రాజు పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఓటర్ల జాబితాల సవరణ, ఓటు హక్కుకు సంబంధించిన అంశాల్లో పారదర్శకత పాటించాలని ఆయన కోరారు.


Comments