108 లైఫ్ సేవియర్ అవార్డుకు కుంట రవి ఎంపిక .
వేలేరు, అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలంలోని మల్లికుదుర్ల గ్రామానికి చెందిన కుంట రవి 108 అంబులెన్స్ సేవల్లో అందిస్తున్న విశిష్ట సేవలకు గాను ప్రతిష్ఠాత్మకమైన 108 లైఫ్ సేవియర్ అవార్డుకు ఎంపికయ్యారు.
అత్యవసర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో స్పందిస్తూ అనేక మంది ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించిన ఆయన సేవలను గుర్తిస్తూ తెలంగాణ 108–జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఈ అవార్డును ప్రకటించింది.
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య చేతుల మీదుగా కుంట రవి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు రవిని అభినందిస్తూ, ఇదే సేవా స్ఫూర్తితో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.
కుంట రవికి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించడంపై మల్లికుదుర్ల గ్రామస్థులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. "ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు, ఒక బాధ్యత... ఒక సేవ. ఎన్నో కుటుంబాలకు ఆశగా నిలిచి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడటం అంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టడమే" అంటూ రవి సేవలను కొనియాడారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో వైద్య సహాయం అందిస్తూ మానవతా దృక్పథంతో సేవలందిస్తున్న కుంట రవి మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు పేర్కొన్నారు.


Comments