వీబీజీ రాంజీ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
చిల్పూర్ ఎంపీడీవో కిరణ్ ప్రసాద్.
చిల్పూర్, అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వీబీజీ రాంజీ పథకం కింద మంజూరైన వ్యవసాయ కుంటలు, ఇంకుడు గుంతలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని చిల్పూర్ ఎంపీడీవో కిరణ్ ప్రసాద్ సూచించారు. మండలంలోని ఉపాధి హామీ పనులను బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. భూగర్భ జలాల పెంపునకు, పంటలకు నీటి కొరత లేకుండా చూడటానికి వ్యవసాయ కుంటలు, ఇంకుడు గుంతలు ఎంతో ఉపయోగపడతాయని ఎంపీడీవో తెలిపారు. ప్రతి రైతు తమ పొలాల్లో ఈ నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వ్యవసాయానికి అనుబంధంగా ఉపాధి హామీ పనుల ద్వారా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులకు పథకానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా మండల కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.ఈ సందర్భంగా ఉపాధి హామీ సిబ్బంది, క్షేత్రస్థాయి సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.


Comments