గ్రామీణ క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేస్తా.
తుడి శ్రీనివాస్ రెడ్డి, తుడి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్.
పెద్దమందడి,అక్టోబర్19(తెలంగాణ ముచ్చట్లు):
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, క్రీడల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తుడి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ తుడి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన వెల్టూర్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ ట్రోఫీ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు నాలుగు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి అవసరమైన ప్రోత్సాహం అందించడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. యువత చదువుతో పాటు క్రీడలపైనా ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఐకమత్యం వంటి లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడాకారులు తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేలా ప్రోత్సహించేందుకు కృషి చేస్తానని చెప్పారు.క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, విజయం సాధించినప్పుడు వినయంగా ఉండటంతో పాటు ఓటమి ఎదురైనప్పుడు నిరుత్సాహపడకుండా దానిని అనుభవంగా మలుచుకోవాలని క్రీడాకారులకు సూచించారు. క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగుతూ తమ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.క్రికెట్ కిట్ల పంపిణీపై క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. తమను ప్రోత్సహిస్తూ క్రీడా సామగ్రిని అందించిన తుడి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అందించిన సహకారం తమకు మరింత ఉత్సాహాన్నిచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, క్రీడాకారులు గ్రామస్తులు పాల్గొన్నారు


Comments