రీ- సర్వేను అడ్డుకున్న విరాయపల్లి రైతులు.
సర్వే సక్రమంగా నిర్వహించి భూముల హద్దులు నిర్ణయించాలని డిమాండ్.
పెద్దమందడి,అక్టోబర్17(తెలంగాణ ముచ్చట్లు):
భూముల రీ సర్వేను సక్రమంగా నిర్వహించి, రైతుల భూములకు సంబంధించి స్పష్టమైన హద్దులు ఏర్పాటు చేయాలని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం విరాయపల్లి గ్రామ రైతులు డిమాండ్ చేశారు. రీ సర్వేలో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ శనివారం సర్వే ప్రక్రియను అడ్డుకున్నారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ భూముల రీ సర్వే నిర్వహించే సమయంలో క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి, రైతుల సమక్షంలో సర్వే చేయాలని కోరారు. సర్వేలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా, భూముల వాస్తవ విస్తీర్ణం, పాత రికార్డులు, సరిహద్దులను పరిశీలించి హద్దులు నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. సర్వేలో పొరపాట్లు జరిగితే భవిష్యత్తులో రైతుల మధ్య భూ వివాదాలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.అధికారులు రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, సమస్యలను పరిష్కరించిన తర్వాతే రీ సర్వే ప్రక్రియను కొనసాగించాలని కోరారు. గ్రామంలోని రైతులందరికీ న్యాయం జరిగేలా పారదర్శకంగా సర్వే నిర్వహించి, భూముల హద్దులను స్పష్టంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.


Comments