రైతుల కన్నీళ్లు ప్రభుత్వానికి కనిపించడం లేదా?
*ఎమ్మెల్యే కవ్వంపల్లి తీరుపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆగ్రహం.*
*అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి.. లేకుంటే క్యాంపు కార్యాలయం ముట్టడిస్తాం.*
మానకొండూర్, అక్టోబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్రం ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటోందని, మానకొండూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కొన్ని మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారని, కరీంనగర్ జిల్లాలోనూ కొన్ని మండలాలకే పరిమితం చేశారని విమర్శించారు.
మానకొండూర్ నియోజకవర్గంలో నెలకొన్న కరువు పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విఫలమయ్యారని ఆరోపించారు. వ్యవసాయ అధికారులతో మాట్లాడి రైతుల సమస్యలను తెలుసుకుని, నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
మిడ్ మానేరు నుంచి నీటిని తీసుకొచ్చి మానకొండూర్ నియోజకవర్గంలోని చెరువులు, కుంటలను ఎందుకు నింపడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎర్రటి ఎండల్లోనూ రైతులకు సాగునీరు అందించామని గుర్తుచేశారు. కమిషన్లపై ఉన్న శ్రద్ధ రైతుల సంక్షేమంపై ఎందుకు లేదని నిలదీశారు. కమిషన్ల విషయంలో తేడాలు రావడంతో క్యాంపు కార్యాలయంలోనే కొట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు.
భూగర్భ జలాలు అడుగంటుతున్నా ఇసుక తవ్వకాలను ఎందుకు నిలిపివేయడం లేదని ప్రశ్నించారు. కరువు పరిస్థితులు నెలకొన్నప్పుడు పంటలు వేయవద్దని రైతులకు ఎందుకు చెబుతున్నారని నిలదీశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లికి ఇసుక అమ్మకాలపై ఉన్న శ్రద్ధ రైతుల బాగోగులపై లేదని రసమయి బాలకిషన్ విమర్శించారు.
మానకొండూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని రసమయి బాలకిషన్ హెచ్చరించారు.


Comments