కడియం శ్రీహరిపై చిల్లర ప్రచారం సిగ్గుచేటు.
నియోజకవర్గ అభివృద్ధిపై అవగాహన లేకుండా విమర్శలా?
– కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలిపాక సతీష్
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
ఘన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కనిపించడం లేదని, నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని సామాజిక మాధ్యమాల్లో కొందరు నాయకులు చేస్తున్న విమర్శలు సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి కొలిపాక సతీష్ మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో ఘన్పూర్ నియోజకవర్గంలో సుమారు రూ.1,600 కోట్లతో వ్యవసాయం, విద్య, వైద్యం తదితర రంగాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 100 పడకల ఆసుపత్రి, సమీకృత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణంతో పాటు బీటీ, సీసీ రహదారుల పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు కాలువల ద్వారా సాగునీరు అందించే చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
అలాగే అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, కల్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు.74 ఏళ్ల వయసులోనూ కడియం శ్రీహరి ప్రజా సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని సతీష్ అన్నారు. నెల రోజుల పాటు తన కుమార్తె వద్దకు వెళ్లిన సందర్భాన్ని ఆసరాగా చేసుకుని ఆయనపై విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు.అభివృద్ధి పనులను గుర్తించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం మానుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కొలిపాక సతీష్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించారు.


Comments