సమస్యల పరిష్కారం కోరుతూ వెల్ది మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల నిరసన.
జనగాం,అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వెల్ది తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయులు, సిబ్బంది నిరసన కార్యక్రమం నిర్వహించారు.స్టేట్ జాక్ ఆఫ్ తెలంగాణ మోడల్ స్కూల్స్ అసోసియేషన్ పిలుపు మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాలకుర్తి శ్రీధర్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఈ నిరసన చేపట్టారు. ఉపాధ్యాయులు ప్లకార్డులు ప్రదర్శించి, నల్ల రిబ్బన్లు ధరించి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులు, సిబ్బందికి సంబంధించిన పలు సమస్యలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేతనాలను 010 హెడ్ ద్వారా చెల్లించాలని, 317 జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీజీటీలను జూనియర్ లెక్చరర్లుగా ఉన్నతీకరించాలని, హిందీ పీజీటీ పోస్టులను మంజూరు చేయాలని కోరారు. 2013 జూన్ నుంచి టీజీటీలకు నోషనల్ ఇంక్రిమెంట్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఉపాధ్యాయులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, న్యాయమైన డిమాండ్లను త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పాలకుర్తి శ్రీధర్‌తో పాటు ఉపాధ్యాయులు గణేష్ కందగట్ల, గడ్డం జయశ్రీ, రుద్రమదేవి, కట్టా రాజు, సౌజన్యప్రియ, పార్వతి, తుమ్మ రవి, మాలతి, లలిత, శశికుమారి, సురేఖ, వసంత మాధురి, రేణుక, వెనిల్ తదితరులు పాల్గొన్నారు.


Comments