కరీంనగర్ డంపింగ్ యార్డుకు విముక్తి దిశగా కీలక అడుగు.
*స్వచ్ఛ భారత్ మిషన్ కింద తొలి విడతగా రూ.17 కోట్ల నిధులు మంజూరు.*
*కేంద్ర మంత్రులు మనోహర్ లాల్, బండి సంజయ్,మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు కార్పొరేటర్ మాసం గణేష్ కృతజ్ఞతలు.*
కరీంనగర్, అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ నగరవాసులను దశాబ్ద కాలంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న డంపింగ్ యార్డ్ దుర్గంధం, కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. డంపింగ్ యార్డ్‌లో పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపు (బయోమైనింగ్), నగర పారిశుద్ధ్య ఆధునీకరణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.17 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కోతిరాంపూర్ చౌరస్తాలో పార్టీలకతీతంగా స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు సంబరాలు నిర్వహించారు.
కరీంనగర్ ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఈ సమస్య పరిష్కారానికి సహకరించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్‌లకు స్థానిక కార్పొరేటర్ మాసం గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కరీంనగర్ పర్యటన సందర్భంగా డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరు కావడం హర్షణీయమన్నారు.
*ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది.*
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాసం గణేష్ మాట్లాడుతూ.. నగరవాసులను దీర్ఘకాలంగా వేధిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా వ్యర్థాలను తొలగించి, నగరాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో మరో రూ.80 కోట్ల నిధులతో డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కేంద్ర మంత్రులు, మేయర్, నగరపాలక సంస్థ ప్రతినిధులు, అధికారులు, జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
*డంపింగ్ యార్డ్‌పై బీఆర్ఎస్ రాజకీయాలు మానుకోవాలి.*
డంపింగ్ యార్డ్ సమస్యపై బీఆర్ఎస్ నాయకులు అనవసర రాజకీయాలు చేస్తున్నారని మాసం గణేష్ విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, అప్పటి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ హయాంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని ఆరోపించారు. ప్రజలు పార్టీ జెండాలను పక్కనపెట్టి సమస్య పరిష్కారం కోసం కోరినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కృషితో నిధులు మంజూరైన నేపథ్యంలో మళ్లీ రాజకీయాలు చేయడం తగదన్నారు. ప్రజల ఆరోగ్యం, నగర అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు.
డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు కావడంతో స్థానిక ప్రజలు, ఆటోనగర్ వాసులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు ఏపీపీ చంద్ర, తోట అనిల్, మేకల వెంకటేష్, బీజేపీ నాయకులు, వివిధ డివిజన్ల ప్రజలు, ఆటో యూనియన్ నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.


Comments