వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం.
కొత్తకోట,అక్టోబర్21(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ సమీపంలోని వెంకటగిరి క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి మాస కల్యాణ మహోత్సవం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం శ్రావణ నక్షత్రంలో భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవాన్ని అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించడంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ కమిషనర్ శ్రీనివాసరావు దంపతులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఐక్యతను బలోపేతం చేస్తాయని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో ఆలయ ఉత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.కల్యాణ మహోత్సవంతో ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పల్లకీ సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించడంతో పాటు తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో వేముల శ్రీనివాస్ రెడ్డి, మద్దిగట్ల శ్రీనివాస్ రెడ్డి, బలిజపల్లి శ్రీనివాసులు, పాలెం మాజీ సర్పంచ్ రామకృష్ణారెడ్డి దంపతులు, వనపర్తికి చెందిన మృత్యుంజయ గుప్త, పాలెం రామచంద్రారెడ్డి, నరేష్ కుమార్ శెట్టి, మండ్ల యుగంధర్ నాయుడు, చర్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి, పాలెం గట్టు యాదవ్, పి. దామోదర్ రెడ్డి, శ్రీనివాసులు గౌడ్, సాంబరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


Comments