దసరా భోజనానికి రాలేదని తండ్రి, తమ్ముడిపై సుత్తితో దాడి!
వేలేరు, అక్టోబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
దసరా పండుగ సందర్భంగా భోజనానికి రాలేదనే కారణంతో తండ్రి, తమ్ముడిపై పెద్ద కుమారుడు సెంట్రింగ్ సుత్తితో దాడి చేసిన ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండలం చింతలతండాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో తండ్రి, తమ్ముడికి తలపై రక్తగాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. చింతలతండాకు చెందిన అంగోత్ మోతీరామ్ (60)కు ఆయన పెద్ద కుమారుడు అంగోత్ రాజు దసరా పండుగ సందర్భంగా తన ఇంట్లో భోజనానికి రావాలని ఆహ్వానించాడు. అయితే, గతంలో పలుమార్లు తనను ఇబ్బందులకు గురిచేస్తూ దూషించాడనే కారణంతో మోతీరామ్, ఆయన భార్య సత్తమ్మ భోజనానికి వెళ్లలేదు.
ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో మోతీరామ్ తన చిన్న కుమారుడి ఇంటి వద్ద ఉండగా అక్కడికి వచ్చిన పెద్ద కుమారుడు రాజు.. తన ఇంటికి భోజనానికి పిలిస్తే ఎందుకు రావడం లేదంటూ తల్లి సత్తమ్మను దూషించి, నెట్టివేసినట్లు సమాచారం. దీనిపై మోతీరామ్ ప్రశ్నించడంతో పాత గొడవలను మనసులో పెట్టుకుని అక్కడే ఉన్న సెంట్రింగ్ సుత్తితో ఆయన తలపై కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడిలో మోతీరామ్‌కు తలపై గాయమై రక్తస్రావం జరిగింది.
అదే సమయంలో అక్కడికి వచ్చిన చిన్న కుమారుడు భాస్కర్ తన తండ్రిపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, రాజు అతనిపై కూడా సుత్తితో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో భాస్కర్‌కు సైతం తలపై రక్తగాయాలయ్యాయి.
బాధితులు ఈ ఘటనపై వేలేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Comments