రావణుడి అంతంతో.. విజయదశమి సందడి!
ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద అట్టహాసంగా విజయదశమి వేడుకలు.
సాంస్కృతిక ప్రదర్శనలతో హోరెత్తిన ప్రాంగణం..
ముఖ్య అతిథులుగా ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకుడు గుండ్రెడ్డి అఖిల్ రెడ్డి
ధర్మసాగర్, అక్టోబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని రిజర్వాయర్ వద్ద రావణాసుర వధ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గుండ్రెడ్డి అఖిల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.మంగళవారం సాయంత్రం సాంస్కృతిక కళాబృందాల నృత్య ప్రదర్శనలతో ప్రారంభమైన ఉత్సవాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం నిర్వహించిన రావణాసుర దహన కార్యక్రమం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించిన రావణ దహనాన్ని తిలకించేందుకు ధర్మసాగర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ధర్మమార్గంలో నడుస్తూ, సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. పండుగలను ప్రజలందరూ సంతోషంగా, ఐకమత్యంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
బీఆర్ఎస్ యువ నాయకుడు గుండ్రెడ్డి అఖిల్ రెడ్డి మాట్లాడుతూ, విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. చెడును విడనాడి మంచి మార్గంలో పయనించడమే విజయదశమి పండుగ ఇచ్చే ప్రధాన సందేశమని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.సాంస్కృతిక ప్రదర్శనలు, రావణాసుర దహన కార్యక్రమంతో ధర్మసాగర్ రిజర్వాయర్ పరిసర
ప్రాంతం పండుగ శోభను సంతరించుకుంది. ప్రజల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో విజయదశమి వేడుకలు అట్టహాసంగా సాగాయి.


Comments