రసాయనాలకు చెక్.. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ.
స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 8(తెలంగాణ ముచ్చట్లు):
జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (ఎన్‌ఎంఎన్‌ఎఫ్)లో భాగంగా రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయంతో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన, సురక్షితమైన ఆహారాన్ని పండించవచ్చని అధికారులు వివరించారు.
మండల వ్యవసాయ అధికారి ఎస్. కరుణాకర్ రైతులకు సహజ వనరులతో ఎరువులు, పురుగుమందుల తయారీ, వినియోగ విధానాలపై అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించడం వల్ల నేల సారాన్ని కాపాడటంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
అనంతరం వరి పొలంలో వర్మీకంపోస్ట్ వినియోగంపై రైతులకు ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించి, దాని తయారీ, వినియోగ విధానాలను వివరించారు. రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరించి రసాయన రహిత పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్‌ఎంఎన్‌ఎఫ్ సమన్వయకర్త హరీష్, సర్పంచ్ ముక్కెర స్వరూప, రవి యాదవ్, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రావణి, రైతులు తదితరులు పాల్గొన్నారు.


Comments