మదనాపురంలో టీఆర్పీ జెండా ఆవిష్కరణ.
బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి
--ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
మదనాపురం,అక్టోబర్08(తెలంగాణ ముచ్చట్లు):
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, పేద సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం, బడ్జెట్‌లో తగిన వాటా, విద్యా–ఉపాధి అవకాశాలు కల్పించాలనే డిమాండ్‌తో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ రాజ్యాధికార మహా పాదయాత్ర వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో కొనసాగింది.మదనాపురం మండల కేంద్రంలో జిల్లా యూత్ అధ్యక్షుడు గుజ్జుల రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో జనాభా నిష్పత్తికి అనుగుణంగా హక్కులు, అవకాశాలు దక్కాలని అన్నారు.ఎన్నికల సమయంలో బీసీలకు పలు హామీలు ఇచ్చి, అనంతరం వాటిని విస్మరించకుండా రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, బీసీ కార్పొరేషన్ నిధుల అమలుపై దృష్టి సారించాలని కోరారు. బీసీల హక్కుల సాధన కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.ఈ పోరాటం ఒకే వర్గానికి పరిమితం కాదని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, పేద సామాజిక వర్గాలను కలుపుకుని సమానత్వంతో కూడిన సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం టీఆర్పీ కృషి చేస్తుందని మల్లన్న పేర్కొన్నారు.జెండా ఆవిష్కరణ అనంతరం మదనాపురం వీధుల్లో పాదయాత్రగా సాగిన మల్లన్న.. సామాన్య ప్రజలు, యువత, వృత్తిదారులను కలుసుకుని స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీసీ రాజ్యాధికార మహా పాదయాత్ర మదనాపురం నుంచి చిన్నచింతకుంట వైపు కొనసాగింది.కార్యక్రమంలో టీఆర్పీ దేవరకద్ర ఇన్‌చార్జి వర్మ ముదిరాజు, పార్టీ అధ్యక్షుడు విజయ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి స్వామి, వివిధ మండలాల అధ్యక్షులు దండు రాములు, కృష్ణయ్యతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొన్నారు.


Comments