లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం.
గురువులకు ఘన సన్మానం.
హుజురాబాద్, అక్టోబర్ 8(తెలంగాణ ముచ్చట్లు ):
గురువుల సేవలు సమాజ నిర్మాణంలో ఎంతో కీలకమని, విద్యార్థులకు విద్యాబుద్ధులు అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేసే ఉపాధ్యాయులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు అన్నారు.
గురుపూజోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హుజురాబాద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు, ఎంఈఓ శ్రీనివాస్ హాజరై హుజురాబాద్ మండలంలోని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి, వారి సేవలను కొనియాడారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని, సమాజ అభివృద్ధికి విద్యారంగం పునాది వంటిదని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కృషిని గుర్తించి గౌరవించడం ద్వారా వారిలో మరింత సేవాభావం, ఉత్సాహం పెరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ హుజురాబాద్ ప్రెసిడెంట్ సోమేశ్వర్, సెక్రటరీ విజయ్ కుమార్, ట్రెజరర్ శబ్దప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. క్లబ్ సభ్యులు ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గురువులను ఘనంగా సత్కరించిన లయన్స్ క్లబ్ నిర్వాహకులను పలువురు అభినందించారు.


Comments