విద్యుత్ భారం మోపొద్దు.. సామాన్యుడిని ఆదుకోవాలి!
చార్జీల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలి: వన్నాల శివాజీ.
హుజురాబాద్,అక్టోబర్ 8(తెలంగాణ ముచ్చట్లు ):
ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం పునరాలోచించాలని హుజురాబాద్ మండలం బీఆర్‌ఎస్ ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ కోరారు.
రోజురోజుకూ కూరగాయలు, వంట నూనె, పాలు, విద్య, వైద్యం, రవాణా తదితర రంగాల్లో ఖర్చులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయంతో కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుండగా, విద్యుత్ చార్జీలను మరోసారి పెంచడం ప్రజలపై అదనపు భారాన్ని మోపినట్లవుతుందని పేర్కొన్నారు.
విద్యుత్ విలాస వస్తువు కాదు.. ప్రతి కుటుంబానికి, రైతుకు, చిన్న వ్యాపారికి, పరిశ్రమకు అత్యవసరమైన సేవ అని శివాజీ అన్నారు. విద్యుత్ చార్జీలు పెరిగితే గృహ వినియోగదారులపై మాత్రమే కాకుండా వ్యాపారాలు, పరిశ్రమలు, సేవా రంగాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.
ప్రజల ఆదాయాలు పెరగకపోయినా ఖర్చులు మాత్రం వరుసగా పెరుగుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కల్పించే చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ చార్జీల పెంపుపై పునరాలోచించి సామాన్య ప్రజలపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకోవాలని వన్నాల శివాజీ విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు భారంగా మారే నిర్ణయాలు కాకుండా.. ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు.


Comments