టీబీ రహిత కరీంనగర్‌ కోసం సమిష్టి కృషి.

టీబీ రహిత కరీంనగర్‌ కోసం సమిష్టి కృషి.

*318 గ్రామ పంచాయతీలను వంద శాతం టీబీ రహితంగా మార్చడమే లక్ష్యం: యాదగిరి సునీల్‌రావు*

కరీంనగర్, అక్టోబర్ 8(తెలంగాణ ముచ్చట్లు ):

జిల్లాను పూర్తిస్థాయిలో టీబీ రహితంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, యువత సమిష్టిగా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు పిలుపునిచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్‌–జోష్ శుభారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో టీబీ బాధితుల పట్ల ఉన్న అపోహలు, వివక్ష కారణంగా చాలామంది సకాలంలో చికిత్స పొందలేకపోయారని, ప్రస్తుతం ప్రభుత్వాల చర్యలతో పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. జిల్లాలోని 318 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే 160కి పైగా గ్రామాలు టీబీ రహిత గ్రామాలుగా గుర్తింపు పొందే దిశగా ముందుకు సాగడం అభినందనీయమన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీబీకి ఉచితంగా మందులు, చికిత్స అందుబాటులో ఉన్నాయని, బాధితులు వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా మందులు వాడితే వ్యాధి నుంచి కోలుకోవచ్చన్నారు. టీబీ నిర్మూలనలో యువత పాత్ర కీలకమని, జోష్ టీమ్‌ల ద్వారా ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

గ్రామాల్లో టీబీ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి ఉచిత వైద్యం అందేలా సర్పంచులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. పోలియోను సమిష్టి కృషితో నిర్మూలించిన విధంగానే టీబీని కూడా నిర్మూలించవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘టీబీ ముక్త్ కరీంనగర్‌’ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, జిల్లా పంచాయతీ అధికారి, రెడ్‌క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ రాధాకృష్ణారెడ్డి, ఎన్‌సీసీ కమాండెంట్, జిల్లా యువజన, క్రీడల అధికారి, సర్పంచులు, ఎంపీడీఓలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News