రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలి.
*ఎండిపోతున్న పంటలను కాపాడాలి.*
*ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: గుంజపడుగు హరిప్రసాద్*
చొప్పదండి, అక్టోబర్ 8(తెలంగాణ ముచ్చట్లు ):
రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ అందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం దత్తూజిపేటలో సరైన విద్యుత్ సరఫరా లేక సాగునీరు అందక ఎండిపోయిన వరి పంటలను ఆయన టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. రైతులు ఎంతో కష్టపడి సాగు చేసిన వరి పంటలకు సరైన సమయంలో నీరు అందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే గుర్తించి పంట నష్టపరిహారం అందించాలని కోరారు. వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడంతో పాటు విద్యుత్ సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని సూచించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హరిప్రసాద్ హెచ్చరించారు.
కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ నాయకులు మ్యాకల తిరుపతి, మ్యాక వినోద్, శ్రీరాముల రమేష్, చంటి శ్రీనివాస్, పుల్ల మల్లేశం, కరీంనగర్ నగర పార్టీ అధ్యక్షురాలు రంగరవేణి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


Comments