కుల వివక్ష నిర్మూలనకు సమైక్య పోరాటం అవసరం:
వేలేరు, , అక్టోబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మండల కన్వీనర్ వేల్పుల రవి ఆధ్వర్యంలో కేవీపీఎస్ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వేల్పుల రవి మాట్లాడుతూ ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన లక్ష్యాలతో కేవీపీఎస్ 1998 అక్టోబర్ 2న ఆవిర్భవించిందని తెలిపారు. సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న కుల వివక్ష, అసమానతలను నిర్మూలించేందుకు సమైక్య పోరాటం అవసరమని పేర్కొన్నారు.
కులాంతర వివాహాలు చేసుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడంతో పాటు పూర్తి రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం అందేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు.
ఆర్థిక అసమానతలను నిర్మూలించి సమాజంలోని అన్ని వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించే దిశగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జన్నారపు రమేష్, ఎం. సాంబరాజు, కె. భద్రయ్య, ఎం. వెంకట్ రాజం, జి. మహేందర్, సుంకరపల్లి వెంకన్న, మూరావత్ తావూర్య, నరసయ్య, దుర్గయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments