జమ్మికుంట వేదికగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ పోరుబాట.

జమ్మికుంట వేదికగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ పోరుబాట.

జమ్మికుంట, అక్టోబర్ 08 (తెలంగాణ ముచ్చట్లు):

బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 9న ‘చలో జమ్మికుంట’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. జేఏసీ రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహారాజ్ చేపట్టిన లక్ష కిలోమీటర్ల ‘మా భూమి రథయాత్ర’ కరీంనగర్ జిల్లాలో పునఃప్రారంభ సభను జమ్మికుంటలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
జమ్మికుంట స్వాతి గార్డెన్స్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ‘ఎవరి కులం ఎంతో.. వారికి అంత వాటా’ పేరుతో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను చైతన్యపరిచి సామాజిక, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ యాత్ర కొనసాగుతున్నట్లు నాయకులు వెల్లడించారు.
జమ్మికుంట మండలంలోని పలు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. దళిత బంధు రెండో విడత అందని బాధితులు, లెదర్ పార్క్ సమస్య, సహారా బాధితుల సమస్య, డంపింగ్ యార్డు సమస్యతో పాటు ఇతర ప్రజా సమస్యలపై సభలో చర్చించి భవిష్యత్ పోరాటాలను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.
సభకు అంబేద్కర్‌వాదులు, ప్రజా సంఘాలు, కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ మహారాజ్, జిల్లా నాయకులు చందు యాదవ్, రాకేష్ మహారాజ్, మారపల్లి తిరుపతయ్య, మాడుగుల సందీప్, కండె సాగర్, వినోద్, శివాజీ, ప్రశాంత్, హరీష్, కిరణ్ తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News