ఆలయాలే లక్ష్యంగా దొంగతనాలు.. మరోసారి గంట అపహరణ!
రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ.. పోలీసుల గస్తీ పెంచాలని గ్రామస్తుల విజ్ఞప్తి.
ఎల్కతుర్తి, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వీరనారాయణపురం గ్రామంలో ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ మండపంలో ఉన్న సుమారు రూ.7,500 విలువైన గంటను అపహరించారు.
శుక్రవారం ఉదయం గౌడ కులస్తులు ఆలయానికి వెళ్లగా గంట కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పరిశీలించారు. దీంతో ఆలయంలో గంట చోరీకి గురైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాల్లో వరుసగా చోరీ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు మండ సారంగం మాట్లాడుతూ ఆలయాల్లో ఇలాంటి దొంగతనాలు పునరావృతం కాకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ ముమ్మరం చేయడంతో పాటు ఆలయాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దేవాలయాల ఆస్తులు, దేవతా విగ్రహాలు, గంటలు, పూజా సామగ్రిని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు, గౌడ సంఘం నాయకులు, గ్రామస్తులు పోలీసులను కోరారు.


Comments