కులవివక్షకు స్వస్తి పలకాలి.. సమానత్వమే లక్ష్యం.
వేలేరు, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా వేలేరు మండలం షోడశపల్లి గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక అవగాహన సభ నిర్వహించారు. తహసీల్దార్ కోమి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కులవివక్ష, అంటరానితనం వంటి సామాజిక అసమానతలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై వివక్షాపూరిత చర్యలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.
తహసీల్దార్ కోమి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జీవించాలని, రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కును గౌరవిస్తూ సామాజిక ఐక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కిషన్ నాయక్, ఎన్‌పీడీసీఎల్ ఏఈ కుమారస్వామి, ఏ ఓ కవిత,ఏఎస్ఐ బాబు, సర్పంచ్ రమాదేవి, హేమనాయక్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు


Comments