నిబంధనల ఉల్లంఘనపై రిషి కళాశాలపై ఫిర్యాదు.
విద్యార్థుల భద్రత, మౌలిక సదుపాయాలపై సమగ్ర విచారణ జరపాలి
బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్ డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
కూకట్‌పల్లిలోని రిషి ఇంజనీరింగ్ కళాశాల, రిషి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశాలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘనలు తేలితే యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (బీఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఉన్నత విద్యా మండలి కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా బోరెల్లి సురేష్ మాట్లాడుతూ, రిషి ఇంజనీరింగ్ కళాశాల, రిషి మహిళా డిగ్రీ కళాశాలల్లో అవసరమైన విద్యా సౌకర్యాలు, ప్రయోగశాలలు, మౌలిక వసతులు, విద్యార్థుల భద్రతా ఏర్పాట్లపై పలు సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు. యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనలకు అనుగుణంగా కళాశాలలు నిర్వహిస్తున్నారా లేదా అనే అంశాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు.
రెండు కళాశాలలు ఒకే ప్రాంగణంలో, ఒకే ప్రవేశ ద్వారం ద్వారా నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రాంగణ నిర్వహణ, ప్రవేశ మార్గాలు, ప్రయోగశాలల లభ్యత, విద్యా మౌలిక సదుపాయాలు, అర్హత కలిగిన అధ్యాపకులు, సిబ్బంది నియామకం, విద్యార్థుల భద్రతా ఏర్పాట్లపై సమగ్రంగా తనిఖీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, కళాశాలల్లో భద్రతా సిబ్బంది నియామకం, వారి విధులు, విద్యార్థులతో వ్యవహరించే తీరుపైనా అధికారులు పరిశీలన జరపాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.ఉన్నత విద్యా మండలి అధికారులు తక్షణమే స్పందించి నిష్పాక్షిక విచారణ చేపట్టాలని, నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బోరెల్లి సురేష్ డిమాండ్ చేశారు.


Comments