అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలి .
అర్హులైన గ్రాడ్యుయేట్లకు సీపీఐ(ఎం) పిలుపు.
చిల్పూర్, అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సీపీఐ(ఎం) చిల్పూర్ మండల కార్యదర్శి సాదం రమేష్ విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను శాసనమండలిలో ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారం కోసం పోరాడే అభ్యర్థులకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.సీపీఐ(ఎం), వామపక్షాల మద్దతుతో ప్రజాసంఘాల అభ్యర్థి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపిస్తూ, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకగా నిలిచే అభ్యర్థిని గెలిపించుకోవడంలో పట్టభద్రుల ఓటరు నమోదు కీలకమని పేర్కొన్నారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన సాధనమని, అర్హత కలిగిన పట్టభద్రులు నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని సాదం రమేష్ కోరారు.


Comments