కరువు వేళ వ్యవసాయ కూలీలను ఆదుకోవాలి.
- బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రే లక్ష్మణ్
ఎల్కతుర్తి, అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు);
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఉపాధి హామీ నిధులు పెంచి వ్యవసాయ కూలీలను ఆదుకోవాలి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని భారత వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రే లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కరువు పరిస్థితులతో వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించి గ్రామీణ పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రామాల్లో వ్యవసాయ పనులు లేక కూలీలు ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మరిన్ని పనిదినాలు కల్పించి వ్యవసాయ కూలీలకు అండగా నిలవాలని కోరారు.
భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బావుల్లో నీరు లేక పంటలు సరిగా పండటం లేదని, దీంతో రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో పశువులకు పశుగ్రాసం కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
వ్యవసాయ కూలీలకు పని కొలతలతో సంబంధం లేకుండా రోజుకు రూ.800 వేతనం చెల్లించాలని, ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని కర్రే లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు కేటాయించి గ్రామీణ కార్మికులకు స్థిరమైన జీవనోపాధి కల్పించాలని కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో బీకేఎంయూ జిల్లా అధ్యక్షుడు మునియాల బిక్షపతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సాంబయ్య, బిల్కురి తులసిరావు తదితరులు పాల్గొన్నారు.


Comments