బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు.
వేలేరు, అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా వేలేరు మండల ప్రజలకు, వాహనదారులకు వేలేరు పోలీసుల తరఫున ఎస్సై దూదిమెట్ల నరేష్ పలు ముఖ్య సూచనలు జారీ చేశారు. మండలంలోని కొంతమంది వ్యక్తులు, యువత రోడ్ల పక్కన, వైన్‌షాపుల ముందు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరుస్తామని స్పష్టం చేశారు.
అదేవిధంగా వాహనదారులు వాహనాలు నడుపుతూ సెల్ఫోన్లో మాట్లాడరాదని, మైనర్ బాలబాలికలకు వాహనాలు ఇచ్చి నడిపించరాదని సూచించారు. రాంగ్ రూట్లో ప్రయాణించరాదని, మండల కేంద్రంలోని రహదారులపై ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేయకూడదని తెలిపారు. ప్రతి వాహనానికి నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.
మోటార్ వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై నరేష్ హెచ్చరించారు. ప్రజలు, వాహనదారులు పోలీసుల సూచనలు పాటిస్తూ రహదారి భద్రతా నియమాలను అనుసరించాలని, ప్రమాదాలకు దూరంగా ఉంటూ సురక్షిత ప్రయాణం సాగించాలని కోరారు.


Comments