420 హామీలిచ్చి వేలేరుకు చేసిందేమిటి?
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేత కీర్తి వెంకటేశ్వర్లు ధ్వజం.
వేలేరు, అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో అధికారంలోకి వచ్చి వేలేరు మండలానికి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని బీఆర్‌ఎస్ నాయకుడు కీర్తి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని షోడశపల్లి గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. రైతులకు ఉపయోగపడని యాప్‌ల పేరుతో వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ పనుల సమయంలో ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయని, అర్హులైన పేదలకు న్యాయం జరగడం లేదని కీర్తి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అధికారులు సమగ్రంగా పరిశీలించి, అర్హులైన పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చామని చెబుతున్న నాయకులు, వేలేరు మండలంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని అన్నారు. మండలంలో అభివృద్ధి చేసినట్లు చెబితే అందుకు సంబంధించిన ఆధారాలను చూపించాలని సవాల్ విసిరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గ్రామాల్లో పర్యటిస్తే ప్రజల తరఫున నిలదీస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతులు, పేదల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అర్హులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ తరఫున పోరాటం కొనసాగిస్తామని కీర్తి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.


Comments