కన్నవారే కాదంటే.. వృద్ధులకు మేమున్నామంటూ బాలవికాస భరోసా!
* బాలవికాస సేవలకు ఏసీపీ మాధవి ప్రశంసలు..
* పోలీసు వారోత్సవాల్లో భాగంగా వృద్ధులకు దుస్తులు, దుప్పట్లు పంపిణీ
జమ్మికుంట, అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
కన్నవారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలే కొందరు వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఆపన్నులకు అండగా నిలుస్తూ అనాథ వృద్ధులకు నిత్యావసర వస్తువులు, దుస్తులు, దుప్పట్లు అందిస్తున్న బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయమని హుజూరాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. సమాజంలో నిరాదరణకు గురైన వృద్ధులకు చేయూతనివ్వడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు.
జమ్మికుంటలోని బాలవికాస కార్యాలయ ఆవరణలో శుక్రవారం అనాథ వృద్ధుల సంక్షేమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ మాధవి మాట్లాడుతూ, తమ వద్దకు ప్రతిరోజూ పలువురు వృద్ధులు వచ్చి తమ పిల్లలపై ఫిర్యాదులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పిల్లలు భవనాల్లో నివసిస్తూ, తమ తల్లిదండ్రులను రేకుల షెడ్లలో ఉంచుతున్నారని పేర్కొన్నారు. వృద్ధుల సంరక్షణ కోసం ప్రభుత్వం చట్టాలను రూపొందించిందని, తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోని వారిపై ఇకపై కౌన్సెలింగ్కే పరిమితం కాకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వృద్ధులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, సమయానికి ఆహారం తీసుకుంటూ చిన్నపాటి వ్యాయామాలు చేయాలని సూచించారు. వచ్చే ఏడాది అనాథ వృద్ధులందరికీ తన తరఫున దుస్తులు, దుప్పట్లు అందజేస్తానని హామీ ఇచ్చారు.
జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లాలో విధులు నిర్వహించిన సమయంలో ఆదివాసీలకు స్వచ్ఛంద సంస్థలు అందించిన సేవలను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. గత ఏడాది బాలవికాస నిర్వహించిన అనాథ వృద్ధుల కార్యక్రమానికి హాజరైనప్పుడు కలిగిన ప్రేరణతో ఈసారి దుప్పట్లు, టవళ్లు అందజేసినట్లు చెప్పారు. పోలీసు వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని, వృద్ధులకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.
15వ వార్డు కౌన్సిలర్ పాతకాల మౌనిక మాట్లాడుతూ, అనాథ వృద్ధులకు ఎల్లవేళలా అండగా ఉంటానని, బాలవికాస నిర్వహించే ప్రతి కార్యక్రమానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.
బాలవికాస ఉమెన్ ప్రోగ్రాం ప్రాజెక్టు కోఆర్డినేటర్ గోపు జ్యోతి మాట్లాడుతూ, తమ సంస్థ ఏడు రాష్ట్రాల్లోని 3,500 గ్రామాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, 250 మంది సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా కృష్ణ కాలనీకి చెందిన మైస స్వప్న తన దివంగత భర్త జ్ఞాపకార్థం, ఇల్లందకుంట గ్రామానికి చెందిన మోటపోతుల ఉజ్వల్ తన తండ్రి జ్ఞాపకార్థం ఒక్కొక్కరు రూ.5,000 చొప్పున విరాళాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై రవి, బాలవికాస జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన, కోఆర్డినేటర్లు కే. సుమలత, ఏ. స్వాతి, ఆసియా, 40 మంది అనాథ వృద్ధులు, ఏడుగురు దివ్యాంగులు పాల్గొన్నారు.


Comments