ఇందిరా గాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం.
గాంధీ చౌరస్తాలో ఘనంగా వర్ధంతి నివాళులు.. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్.
జమ్మికుంట, అక్టోబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):
భారత తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. శనివారం పట్టణంలోని గాంధీ చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా సుంకరి రమేష్ మాట్లాడుతూ ఇందిరా ప్రియదర్శిని గాంధీ భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకురాలని కొనియాడారు. 1966 నుంచి 1977 వరకు వరుసగా మూడుసార్లు, 1980లో మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశానికి సేవలందించారని గుర్తుచేశారు. భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కుమార్తెగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఇందిరా గాంధీ, తొలుత తండ్రి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు కార్యదర్శిగా సేవలందించారని తెలిపారు.
1964లో జవహర్‌లాల్ నెహ్రూ మరణానంతరం రాజ్యసభకు ఎన్నికై, లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారని వివరించారు. దేశ రాజకీయాల్లో మహిళా నాయకత్వానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఇందిరా గాంధీ సేవలు, త్యాగాలు ఎప్పటికీ స్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్, టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయిని రవి, కాంగ్రెస్ కౌన్సిలర్లు శ్రీపతి నరేష్, పొనగంటి విష్ణు, దిడ్డి రామ్మోహన్, కుతాడి తిరుపతి, చందరాజు, గడ్డం దీక్షిత్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దొగ్గల భాస్కర్, పిట్టల రమేష్, పొనగంటి మధు, పంజాల అజయ్, ఎం.డి. సలీం, పాత ప్రసాద్, పాతకాల ప్రవీణ్, గుఱ్ఱం ప్రవీణ్ కుమార్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments