పట్టభద్రుల ఓటు నమోదు గడువు మరో 10 రోజులు పొడిగించాలి.
సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్.
వనపర్తి,నవంబర్01(తెలంగాణ ముచ్చట్లు):
పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం గడువును మరో 10 రోజులు పొడిగించాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని కోరారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడికి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.చాలామంది పట్టభద్రులు వివిధ కారణాలతో ఇప్పటివరకు ఓటర్లుగా నమోదు చేసుకోలేకపోయారని తెలిపారు. ఉద్యోగాలు, ఉన్నత చదువులు, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండటం వంటి కారణాలతో నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోలేకపోయారని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియపై సరైన అవగాహన లేకపోవడం, ఆన్లైన్ దరఖాస్తు సమయంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు కూడా నమోదు ఆలస్యానికి కారణమవుతున్నాయని అన్నారు.పట్టభద్రుల ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో పట్టభద్రుల భాగస్వామ్యం కీలకమని శంకర్ గౌడ్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో మరో పది రోజుల పాటు గడువు పొడిగిస్తే ఇప్పటివరకు నమోదు చేసుకోలేకపోయిన వేలాది మంది పట్టభద్రులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.ఇప్పటికీ అనేకమంది పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం వెంటనే స్పందించి గడువు పొడిగింపుపై స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని కోరారు. పట్టభద్రుల గొంతుకగా తాను చేస్తున్న ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం, ఎన్నికల సంఘం సానుకూలంగా పరిగణించాలని పలుస శంకర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.


Comments