అవినీతికి కేరాఫ్ బీఆర్ఎస్.. బీజేపీపై ఆరోపణలు చేస్తే సహించం.
*చల్ల హరిశంకర్ వ్యాఖ్యలపై బీజేపీ కార్పొరేటర్లు బండారి వేణు, సోమిడి వేణు ప్రసాద్ తీవ్ర ఆగ్రహం.*
కరీంనగర్, నవంబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
గత బీఆర్ఎస్ పాలన అంతా అవినీతి, అక్రమాలు, భూకబ్జాల మయమని, ఎలాంటి ఆధారాలు లేకుండా బీజేపీ పాలకవర్గానికి అవినీతి మచ్చ పూయాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని బీజేపీ కార్పొరేటర్లు బండారి వేణు, సోమిడి వేణు ప్రసాద్ తీవ్రంగా హెచ్చరించారు. కరీంనగర్‌లోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నగర అభివృద్ధి, ప్రజలకు పారదర్శకమైన సుపరిపాలన అందించడమే లక్ష్యంగా తమ పాలకవర్గానికి దిశానిర్దేశం చేస్తున్నారని తెలిపారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో అవినీతికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వొద్దని చేసిన సాధారణ సూచనలను వక్రీకరించి చౌకబారు ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ నేతల దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొందరు కార్పొరేటర్లు అవినీతి, భూకబ్జాలు, దందాలకు పాల్పడి ప్రజలను భయాందోళనలకు గురిచేసిన చరిత్రను మరిచిపోయారా అని ప్రశ్నించారు. డబ్బుల కోసం కాంపౌండ్ గోడలు, నివాస గృహాలను కూల్చే బుల్డోజర్ సంస్కృతిని పెంచి పోషించింది బీఆర్ఎస్ నాయకులు కాదా అని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతికి పాల్పడి జైలుకెళ్లిన నేతలను పరామర్శించడం, వారికి లీగల్ అడ్వైజరీ కమిటీలు నియమించి, లక్షల రూపాయలు అందించి విదేశాలకు పంపిన చరిత్ర ఆ పార్టీ నాయకులదని ఆరోపించారు.
నగరపాలక సంస్థ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పేరుతో అవినీతికి పాల్పడి సంస్థను దోచుకుంది చల్ల హరిశంకర్ కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేత రవీందర్ సింగ్ వ్యవహారమంతా నగర ప్రజలకు తెలుసని, గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, మున్సిపల్ షట్టర్ విషయంలో ఆయన వ్యవహరించిన తీరును మరిచిపోయి మాట్లాడటం సరికాదన్నారు.
కరీంనగర్ నగరపాలక సంస్థలో ప్రజలు బీఆర్ఎస్ను సింగిల్ డిజిట్‌కే పరిమితం చేసినా ఆ పార్టీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. నిజాయితీగా, పారదర్శకంగా పనిచేస్తున్న బీజేపీ పాలకవర్గంపై అనవసరంగా బురదజల్లితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు తాటి ప్రభావతి, దేశ శిల్ప వేదం, పెద్దపల్లి శ్రీలేఖ జితేందర్, బండ రమణ రెడ్డి ప్రకాష్, వంగల పవన్, మేకల వెంకటేష్, భూపతి రవీందర్, కేఏపీపీ చంద్ర, కన్న కృష్ణ, కర్రే పద్మ అనిల్, కొంపల్లి రమణ, తోట అనిల్, మాసం గణేష్, సత్యం, గొట్టముక్కల రమణ, గాజా శివరాం, ముజీబ్, నందు తదితరులు పాల్గొన్నారు.


Comments