భూమి వివాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య.
ఖిల్లా ఘనపూర్,నవంబర్03(తెలంగాణ ముచ్చట్లు):
భూమి వివాదాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది కాంగ్రెస్ నాయకులు రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య ఆరోపించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే భూమి వివాదాన్ని తెరపైకి తెచ్చి తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా, తనను అడ్డుపెట్టుకుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని విమర్శించడం కూడా సరికాదని ఆయన తప్పుబట్టారు.ఈ మేరకు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాళ్ల కృష్ణయ్య భూమి వివాదానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గతంలో దళిత కుటుంబానికి చెందిన వ్యక్తుల నుంచి వారి పూర్తి ఇష్టపూర్వక అంగీకారంతో, గ్రామస్తుల సమక్షంలో సాదా బైనామా ద్వారా భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. భూమి కొనుగోలుకు సంబంధించి డబ్బులు చెల్లించి, అనంతరం పట్టాదారు పాస్ పుస్తకం కూడా పొందినట్లు పేర్కొన్నారు. తాను ఎలాంటి భూకబ్జాకు పాల్పడలేదని స్పష్టం చేశారు.అయితే, భూమిని విక్రయించిన వ్యక్తికి నలుగురు కుమారులు ఉండగా, వారిలో ఒకరు ప్రస్తుతం సదరు భూమి తమదంటూ వివాదం సృష్టిస్తూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు కృష్ణయ్య తెలిపారు. ఈ వ్యవహారాన్ని కొంతమంది రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా మలుచుకుంటూ కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.తాను ఎవరి భూమినీ బలవంతంగా స్వాధీనం చేసుకోలేదని, ఒకవేళ భూమిని విక్రయించిన కుటుంబ సభ్యులు తమ భూమిని తిరిగి తీసుకోవాలనుకుంటే, తాను చెల్లించిన డబ్బులను తిరిగి చెల్లిస్తే భూమిని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని రాళ్ల కృష్ణయ్య వెల్లడించారు. గ్రామస్తుల సమక్షంలో ఇరువర్గాల అంగీకారంతోనే ఈ భూమి లావాదేవీ జరిగిందని, ఇందులో ఎలాంటి అక్రమాలకు తావులేదని పేర్కొన్నారు.అలాగే, తనపై వస్తున్న ఆరోపణలను ఆసరాగా చేసుకుని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని విమర్శించడం సమంజసం కాదని ఆయన అన్నారు. తన వ్యక్తిగత భూమి వివాదానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, తనను అడ్డుపెట్టుకుని ఆయనపై రాజకీయ విమర్శలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. వ్యక్తిగత వివాదాన్ని రాజకీయాలకు ముడిపెట్టి బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు.రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని, భూమి వ్యవహారంలో వాస్తవాలు తెలుసుకోకుండా తనపై, పార్టీ నాయకులపై ఆరోపణలు చేయడం సరికాదని రాళ్ల కృష్ణయ్య అన్నారు.


Comments