పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం.
ధర్మసాగర్ మండలంలోని ఐదు గ్రామాల్లో విస్తృత ప్రచారం.
ధర్మసాగర్,నవంబర్02 (తెలంగాణ ముచ్చట్లు):
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలనే లక్ష్యంతో ధర్మసాగర్ మండల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఓటరు నమోదు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.మండలంలోని మల్లక్‌పల్లి, ధర్మాపురం, తాటికాయల, పెద్దపెండ్యాల, కరుణాపురం గ్రామాల్లో కమిటీ సభ్యులు పర్యటించి పట్టభద్రులకు ఓటరు నమోదు ప్రాముఖ్యతను వివరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేస్తూ, అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.అదేవిధంగా ఓటరు నమోదుకు అవసరమైన ధ్రువపత్రాలు, దరఖాస్తు విధానం తదితర అంశాలపై పట్టభద్రులకు అవగాహన కల్పించారు. అర్హులైన ఒక్క పట్టభద్రుడు కూడా ఓటు హక్కును కోల్పోకుండా ప్రతి ఒక్కరూ నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ మండల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జులు కర్ర సోమిరెడ్డి, గుర్రపు ప్రవీణ్, మాజీ మండల అధ్యక్షులు మునిగెల రాజు,సీనియర్ నాయకులు సోంపెల్లి కరుణాకర్,ననుబాల చంద్రమౌళి,వల్లాల రాజు తదితరులు పాల్గొన్నారు.


Comments