గ్రావెల్ అనుమతులకు కొత్త ఆన్‌లైన్ విధానం.. మూడు నుంచి ఐదు రోజుల్లోనే మంజూరు!
అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు సమీకృత గ్రావెల్ నిర్వహణ పోర్టల్ ప్రారంభం
ఇక మొబైల్ ద్వారానే దరఖాస్తు..
క్యూఆర్ కోడ్‌తో అనుమతుల జారీ
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ, నవంబర్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
జిల్లాలో గ్రావెల్ (మట్టి) తవ్వకాలకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు సమీకృత గ్రావెల్ నిర్వహణ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇంటిగ్రేటెడ్ గ్రావెల్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఐజీఎంఎస్) పోర్టల్‌ను సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఆమె లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నూతన విధానం అమలు, దరఖాస్తుల ప్రక్రియ, అనుమతుల మంజూరు తదితర అంశాలను కలెక్టర్ వివరించారు. ఈ పోర్టల్ ద్వారా ప్రజలు తమ మొబైల్ నంబర్ నమోదు చేసి, ఓటీపీ ద్వారా లాగిన్ అయి గ్రావెల్ తవ్వకాలకు అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి, రెవెన్యూ భూములకు సంబంధించిన అనుమతులను మూడు నుంచి ఐదు రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సమన్వయంతో ఈ పోర్టల్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు సమయంలో ఆధార్ తదితర ప్రాథమిక వివరాలతో పాటు గ్రావెల్ ఎక్కడి నుంచి తీసుకోవాలనుకుంటున్నారనే సమాచారం నమోదు చేస్తే సరిపోతుందని తెలిపారు. సొంత పట్టా భూమి నుంచి మట్టి తీసుకోవాలనుకుంటే పట్టాదారు పాస్‌బుక్ ప్రతిని, ఇతరుల పట్టా భూమి నుంచి తీసుకోవాలనుకుంటే భూయజమాని సమ్మతి పత్రాన్ని అప్‌లోడ్ చేయాలని సూచించారు. ప్రభుత్వ భూముల విషయంలో సర్వే నంబర్, భౌగోళిక స్థాన వివరాలను సమర్పించాల్సి ఉంటుందని వివరించారు.
దరఖాస్తుల పరిశీలన కోసం రెవెన్యూ శాఖకు ప్రత్యేకంగా మూడు పేజీల తనిఖీ జాబితాను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశాలుంటే ఆ శాఖకు కూడా దరఖాస్తులను పంపిస్తారని, ఆ శాఖ అధికారులు రెండు రోజుల్లో పరిశీలించి తిరిగి రెవెన్యూ శాఖకు పంపిస్తారని చెప్పారు. రెవెన్యూ శాఖ నిరభ్యంతర పత్రం జారీ చేసిన అనంతరం, గ్రావెల్ పరిమాణం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో గనుల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారని తెలిపారు. పరిమాణం తక్కువగా ఉన్న దరఖాస్తులను జిల్లా స్థాయిలో పరిశీలించి అనుమతులు జారీ చేస్తారని వివరించారు.
అనుమతులు మంజూరైన తర్వాత సంబంధిత వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్ రూపొందుతుందని కలెక్టర్ వెల్లడించారు. ఎంత పరిమాణంలో గ్రావెల్ తరలించాలి, ఏ ప్రాంతం నుంచి తీసుకెళ్లాలి, గమ్యస్థానం, అనుమతి చెల్లుబాటు సమయం వంటి వివరాలు అందులో ఉంటాయని తెలిపారు. అనుమతి పొందిన ట్రాక్టర్లు, ఇతర వాహనాల నంబర్లను కూడా నమోదు చేస్తారని, ఆ వాహనాల ద్వారానే గ్రావెల్ తరలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ ప్రక్రియలో గ్రామ పంచాయతీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తారని, అనుమతించిన ట్రిప్పుల సంఖ్యతో పాటు వాస్తవంగా తరలించిన ట్రిప్పులను కూడా పర్యవేక్షించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పోర్టల్ వినియోగంపై రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికే శిక్షణ అందించినట్లు తెలిపారు. గ్రావెల్ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని గ్రామ పంచాయతీలకు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ పోర్టల్ ఇసుక అనుమతులకు సంబంధించింది కాదని, కేవలం గ్రావెల్ (మట్టి) తవ్వకాలు, తరలింపునకు మాత్రమే వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇసుక కోసం ఇప్పటికే ప్రత్యేక పోర్టల్ అందుబాటులో ఉందని తెలిపారు.
గనుల శాఖ వద్ద ఇప్పటికే మరో పోర్టల్ ఉన్నప్పటికీ, అది ప్రధానంగా జాతీయ రహదారుల వంటి పెద్ద ప్రభుత్వ పనులకు అవసరమైన వేల మెట్రిక్ టన్నుల గ్రావెల్ అనుమతుల కోసం ఉపయోగపడుతోందన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, ఇతర చిన్నచిన్న అభివృద్ధి పనులకు తక్కువ పరిమాణంలో గ్రావెల్ అవసరమైనప్పుడు అనుమతులు పొందడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ఈ నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.
గ్రావెల్ అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, నూతన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారులు, మీడియా ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ కోరారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు సందేహాలను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, గనుల శాఖ సహాయ సంచాలకులు నివృత్తి చేశారు. అనంతరం ఐజీఎంఎస్ పోర్టల్‌కు సంబంధించిన ప్రచార పోస్టర్లను కలెక్టర్, ఇతర అధికారులు ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. రవి, స్థానిక సంస్థల ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, డీఆర్వో శ్రీనివాస్, గనుల శాఖ ఏడీ రామాచారి, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి, జీడబ్ల్యూఎంసీ కాజీపేట డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, సీ సెక్షన్ సూపరింటెండెంట్ చల్లా ప్రసాద్, సీజీజీ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధాకృష్ణ, ఈడీఎంశ్రీధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.


Comments