రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి.
500 మందితో ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
నిందితులను అరెస్ట్ చేయకపోతే పోలీస్‌స్టేషన్ ముట్టడిస్తాం
ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు భీమా నాయక్
పెద్దగూడూరు, నవంబర్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ఉద్యమకారుడు, జర్నలిస్ట్ బానోత్ రామన్న నాయక్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ లంబాడీ హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) ఆధ్వర్యంలో పెద్దగూడూరు మండల కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సుమారు 500 మంది పాల్గొన్న ఈ ర్యాలీలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధితుడికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు భీమా నాయక్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజల పక్షాన తన కలంతో గళమెత్తుతున్న తెలంగాణ ఉద్యమకారుడు, జర్నలిస్ట్ రామన్న నాయక్‌పై హత్యాయత్నం జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా పోలీసులు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఒక జర్నలిస్ట్‌పై, తెలంగాణ ఉద్యమకారుడిపై దాడి జరిగితేనే పోలీసులు స్పందించకపోవడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామన్న నాయక్‌పై హత్యాయత్నానికి పాల్పడిన వారిని గుర్తించి తక్షణమే అరెస్ట్ చేయాలని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రౌడీలు, గూండాలను ప్రోత్సహిస్తూ సమాజంలో భయాందోళనలు సృష్టించే వారిని కూడా చట్టప్రకారం శిక్షించాలని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను భయపెట్టే దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితులను అరెస్ట్ చేయకపోతే పోలీస్‌స్టేషన్ ముట్టడితో పాటు ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గుగులోతు భీమా నాయక్ హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు బానోతు చందులాల్ నాయక్, పార్లమెంట్ ఇన్‌చార్జి రాందాస్ నాయక్, ఎన్‌టీవీఎస్ జిల్లా అధ్యక్షుడు వీరేష్ నాయక్, డీఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు దేవేందర్, చందా, ఈశ్వర్, మల్లు, చంగ్లాల్, శీను నాయక్, శివవర్మ నాయక్, రాము, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


Comments