గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించండి
మాదిగ సామాజిక వర్గానికి చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి
తెలంగాణ ఉద్యమంతో పాటు వర్గీకరణ ఉద్యమంలోనూ పనిచేశా.. నాకు అవకాశం ఇవ్వండి
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన డాక్టర్ పిడమర్తి రవి
హైదరాబాద్ (తెలంగాణ ముచ్చట్లు):
త్వరలో భర్తీ చేయనున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పిడమర్తి రవి కోరారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు మహేష్ కుమార్ గౌడ్‌ను ఢిల్లీలో కలిసి తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గాల్లో ఒకటైన మాదిగలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటు మాదిగ వర్గీకరణ ఉద్యమంలోనూ తాను చురుకుగా పనిచేశానని, అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన గుర్తింపు, సముచిత స్థానం లభించలేదని పేర్కొన్నారు.
గవర్నర్ కోటాలో భర్తీ చేయనున్న ఎమ్మెల్సీ స్థానాల్లో మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తూ తనకు అవకాశం కల్పించాలని కోరారు. మాదిగలను శాసనమండలికి పంపించడం ద్వారా చట్టసభల్లో ఆ వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని మహేష్ కుమార్ గౌడ్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాదిగ వర్గీకరణ సమస్య పరిష్కారమైన నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పిడమర్తి రవి అన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలోనూ మాదిగలకు సముచిత స్థానం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాదిగ రాజకీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఒక్కలగడ్డ చంద్రశేఖర్‌తో పాటు పలువురు మాదిగ నాయకులు పాల్గొన్నారు.


Comments