ప్రజావాణి అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి.
ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు..
నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి
అధికారులను ఆదేశించిన
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ, నవంబర్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఏ అధికారి కూడా నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.
సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి అనేది ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వివిధ శాఖలకు సంబంధించిన వినతులు పెండింగ్‌లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టరేట్‌తో పాటు హనుమకొండ, పరకాల ఆర్డీవో కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 232 అర్జీలు అందాయి. ఇందులో జిల్లా కలెక్టరేట్‌లో 116, ఆర్డీవో కార్యాలయాల్లో 21, ఎంపీడీవో కార్యాలయాల్లో 95 అర్జీలను అధికారులు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, స్థానిక సంస్థల ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Comments