*నిబంధనలకు విరుద్ధంగా కార్తికేయ ఆసుపత్రి నిర్వహణ.. వెంటనే సీజ్ చేయాలి.
* రోగి మృతిపై సమగ్ర విచారణ జరపాలి..
* కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్లూరి కిషోర్ డిమాండ్
జమ్మికుంట, నవంబర్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలోని కార్తికేయ ఆసుపత్రిని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని, వెంటనే ఆసుపత్రిని సీజ్ చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ఉపాధ్యక్షుడు వడ్లూరి కిషోర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జమ్మికుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు, ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ వైద్య సేవలు అందిస్తున్నారని ఆరోపించారు. పట్టణంలో జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతంలో ఆసుపత్రి నిర్వహిస్తుండటంతో వాహనాల పార్కింగ్ సమస్య ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత కొద్ది రోజుల క్రితం ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ రోగికి అధిక మోతాదులో మందులు ఇవ్వడం వల్ల మృతి చెందినట్లు ఆరోపించారు. ఈ ఘటనపై కూడా సమగ్ర విచారణ జరపాలని కోరారు.
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించి ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన అనుమతులు, వైద్య ప్రమాణాలు, రోగి మృతికి సంబంధించిన ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిని సీజ్ చేయాలని, అధికారులు స్పందించని పక్షంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.


Comments