జూన్ నాటికి కూసుమంచి వంద పడకల ఆసుపత్రిని సిద్ధం చేయాలి.

జూన్ నాటికి కూసుమంచి వంద పడకల ఆసుపత్రిని సిద్ధం చేయాలి.

* విద్య, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది 
* రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
* గంగబండ తండా వద్ద హాస్పిటల్ నిర్మాణ  పనుల పరిశీలన

ఖమ్మం బ్యూరో, నవంబర్ 3(తెలంగాణ ముచ్చట్లు )

కూసుమంచి మండల కేంద్ర సమీపంలోని గంగ బండ తండా వద్ద రూ.45 కోట్లతో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని నిర్దిష్ట గడువు మేరకు జూన్ నెల నాటికి సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. కలెక్టర్ దివాకర.టిఎస్, ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, ఇతర అధికారులతో కలిసి స్లాబ్ దశలో ఉన్న నిర్మాణ పనులను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదవారికి అనారోగ్యం కలిగితే, వారు ఆర్థికంగా చితికి పోకుండా మెరుగైన వైద్య సేవలు అందించేలా ఈ వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నామని అన్నారు. పూర్తిస్థాయిలో వైద్యులను, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ పాలనలో పేదలకు ఏదైనా జబ్బు చేస్తే.. రోడ్డున పడే పరిస్థితి ఉండేదని, తమ ప్రజాపాలనలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి ఆరోగ్య భరోసా అందిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ( సీఎంఆర్ఎఫ్) ద్వారా.. కోట్లాది నిధులతో పేదలకు ఆర్థిక తోడ్పాటు ఇచ్చానని చెప్పారు. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో అర్హులైన పేదలందరికీ లబ్ధి చేకూరుస్తున్నామన్నారు.  
*ఈ కార్యక్రమంలో:* కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు హఫీజుద్దీన్, జూకూరి గోపాలరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్, వైద్య శాఖ ఈఈ టీ. ఉమామహేశ్వర రావు, కూసుమంచి తహసీల్దార్ సైదులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News