పాలమూరు రైతులకు అన్యాయం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే.
గత తొమ్మిదేళ్ల నిర్లక్ష్యంతోనే సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్‌లో పడ్డాయి
-- మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి,నవంబర్03(తెలంగాణ ముచ్చట్లు):
పాలమూరు రైతాంగానికి సాగునీటి విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వమే తీవ్ర అన్యాయం చేసిందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి విమర్శించారు. తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉండి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిన నాయకులు ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.మంగళవారం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి, జూరాల తదితర ప్రాజెక్టుల పనులు పెండింగ్‌లో ఉండటానికి గత పాలకుల వైఫల్యమే కారణమని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని చెబుతున్న మాజీ మంత్రి హరీష్‌రావు, ప్రాజెక్టు అంచనా వ్యయం, ఇప్పటివరకు చేసిన ఖర్చు, మిగిలిన పనుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.జూరాల నీటి నిల్వ సామర్థ్యం, రామన్‌పాడు సమాంతర కాలువ నిర్మాణంలోని సాంకేతిక లోపాలు, గూడెం దొడ్డి రిజర్వాయర్ నిర్మాణం వంటి అంశాలను ప్రస్తావిస్తూ గతంలోనే సమస్యలను పరిష్కరించి ఉంటే రైతాంగానికి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కృష్ణా జలాల వినియోగం, ఆంధ్రప్రదేశ్‌కు నీటి తరలింపు అంశాల్లో గత ప్రభుత్వ వైఖరిపై కూడా ప్రశ్నలు సంధించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సాగునీటి సరఫరాకు చర్యలు చేపడుతోందని తెలిపారు.ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ల పాలనలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు రైతుల సమస్యలపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. గతంలో రైతులను పట్టించుకోని నాయకులు నేడు రైతుల పక్షాన మాట్లాడటం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని విమర్శించారు. 365 కరువు మండలాల ప్రకటన అనంతరం రైతుల సమస్యలపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు.గత తొమ్మిదేళ్లలో ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారు? ఎన్ని పూర్తి చేశారు? పాలమూరు రైతాంగానికి ఎంత మేర సాగునీరు అందించారు? అనే ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిపై కూడా ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు అందాల్సిన సాగునీటిని తన ఫామ్‌హౌస్‌ల వైపు మళ్లించుకున్నారని ఆరోపించారు. గతంలో 'వరి వేస్తే ఉరే' అంటూ రైతులను భయపెట్టిన నాయకులు ఇప్పుడు రైతుల సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు.రైతుల కష్టాలను ప్రభుత్వం గుర్తించిందని, ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమీక్షలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి కరువు పరిస్థితులపై చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రైతులకు సత్వర ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని భరోసా ఇచ్చారు.గత పాలకులు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు రైతుల సమస్యలను రాజకీయ అస్త్రాలుగా మార్చుకోవద్దని, సాగునీటి రంగంలో గత తొమ్మిదేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి రమేష్, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, పట్టణ అధ్యక్షులు కదిరే రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మంచారి, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పెబ్బేరు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సుమిత్ర ఎల్లారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ డీసీసీ అధ్యక్షులు శంకర్ ప్రసాద్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments