22వ సారి రక్తదానం చేసిన వేలేరు మాజీ ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్.
వేలేరు, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కాజీపేట పరిధిలోని రాజరాజేశ్వర గార్డెన్స్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో వేలేరు మాజీ ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్ 22వ సారి రక్తదానం చేశారు. ధర్మసాగర్ సీఐ, వేలేరు ఎస్సై సూచన మేరకు తన శ్రేయోభిలాషులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ రక్తదాన శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరైన కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన సద్దాంహుస్సేన్‌ను పోలీసు అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం గొప్ప మానవతా సేవ అని, మనం ఇచ్చే ఒక్క యూనిట్ రక్తం ఆపదలో ఉన్న మరొకరి ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకుని, స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Comments