గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి.
*పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.*
*ఎల్ నినో ప్రభావంతో నీటి కొరతకు అవకాశం.*
*ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి: ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ.*
మానకొండూర్, అక్టోబర్ 24(తెలంగాణ ముచ్చట్లు ):
మానకొండూర్ నియోజకవర్గ ఇల్లంతకుంట మండలంలోని గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులకు సూచించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో మండల పరిధిలోని సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు తదితర అంశాలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి సకాలంలో పరిష్కరించాలని, అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు.
*ఎల్ నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి*
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో పాటు నీటి కొరత, విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే యాసంగి (రబీ) సీజన్‌లో అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు, తక్కువ నీటితో సాగయ్యే పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.
తాగునీటికి ప్రాధాన్యతనిస్తూ అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని తెలిపారు. కరువు పరిస్థితులు తలెత్తితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
మండల పరిధిలోని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


Comments