వైకల్యాన్ని జయించి.. విజేతగా నిలిచాడు!
పారా క్రీడల్లో మెరిసిన జిట్టాగూడెం సిద్ధార్థ నాయక్
తండ్రి మరణించినా ఆగని ప్రయాణం.. తల్లి అండతో జాతీయ స్థాయికి!
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
పుట్టుకతోనే శారీరక వైకల్యం.. చిన్నతనంలోనే ఎన్నో కష్టాలు.. చదువులోనూ సవాళ్లు.. క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న సమయంలో తండ్రి మరణం.. అయినా అతడు వెనకడుగు వేయలేదు. కన్నీళ్లను దిగమింగి, కష్టాలను అధిగమించి తన ప్రతిభతో విజయాలను సొంతం చేసుకున్నాడు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బంగారు పతకాలు సాధించి, తెలంగాణ తరఫున జాతీయ స్థాయి పారా క్రీడలకు ఎంపికయ్యాడు. ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచిన ఆ యువ క్రీడాకారుడే జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం జిట్టాగూడెం తండాకు చెందిన అజ్మీరా సిద్ధార్థ నాయక్.
తల్లిదండ్రుల అండతో.. చదువులో ముందడుగు
అజ్మీరా నాగేష్, దేవి దంపతుల కుమారుడైన సిద్ధార్థ శారీరక వైకల్యంతో జన్మించాడు. అతని ఎదుగుదలపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ తల్లిదండ్రులు ధైర్యం కోల్పోకుండా అండగా నిలిచారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ చదువును కొనసాగించిన సిద్ధార్థ.. తన కాళ్లపై తాను నిలబడాలనే సంకల్పంతో ముందుకు సాగాడు.ఒకటి నుంచి పదో తరగతి వరకు శివునిపల్లి బాలుర పాఠశాలలో చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ కోసం తొలుత హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో చేరినా, సహచరుల నుంచి ఎదురైన ఇబ్బందులతో మనస్తాపానికి గురయ్యాడు. తల్లిదండ్రుల సూచనతో స్టేషన్ ఘన్‌పూర్‌కు తిరిగివచ్చి మోడల్ స్కూల్లో సీఈసీ విభాగంలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ప్రస్తుతం కాకతీయ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు.
ప్రోత్సాహమే.. విజయానికి బాట
చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకున్న సిద్ధార్థకు పారా క్రీడాకారుడు పిట్టల కుమార్ ప్రోత్సాహం అందించారు. అథ్లెటిక్స్‌లో రాణించేందుకు శిక్షణ తీసుకోవాలని సూచించారు. ఆయన ప్రోత్సాహంతో జనగామ జిల్లా స్థాయి పారా క్రీడా పోటీల్లో పాల్గొన్న సిద్ధార్థ అథ్లెటిక్స్ విభాగంలో బంగారు పతకం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
తండ్రి మరణం.. అయినా లక్ష్యం వైపే అడుగులు
సిద్ధార్థ రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధమవుతున్న సమయంలో తండ్రి నాగేష్ మరణం కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయిన బాధ ఒకవైపు.. క్రీడల్లో రాణించాలనే లక్ష్యం మరోవైపు అతడిని పరీక్షించాయి. అయినప్పటికీ తండ్రి ఆశయాలను నెరవేర్చాలనే సంకల్పంతో తన ప్రయాణాన్ని ఆపలేదు. తండ్రి అంత్యక్రియల అనంతరం కూడా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమై, తన పట్టుదలను చాటుకున్నాడు.
అండగా నిలిచిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన సిద్ధార్థకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అండగా నిలిచారు. జిల్లా క్రీడల శాఖ అధికారి ఎన్. లక్ష్మీనర్సింహారావు, మోడల్ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్‌రెడ్డి ప్రోత్సాహం అందించారు. వారి సహకారంతో రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ బంగారు పతకం సాధించిన సిద్ధార్థ.. తెలంగాణ తరఫున జాతీయ స్థాయి పారా క్రీడల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాడు.శారీరక వైకల్యం తన విజయానికి అడ్డంకి కాదని, కష్టాలు ఎదురైనా లక్ష్యంపై దృష్టి సారిస్తే విజయాన్ని సాధించవచ్చని సిద్ధార్థ నిరూపిస్తున్నాడు. తండ్రిని కోల్పోయిన బాధను గుండెల్లో దాచుకొని, తల్లి ఆశలకు ప్రతిరూపంగా ఎదుగుతున్న ఈ యువ క్రీడాకారుడి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.


Comments