వనపర్తి పర్యాటక రంగానికి కొత్త కళ.. రూ.14 కోట్లతో అభివృద్ధి పనులు.
9 ప్రాంతాల్లో పర్యాటక సదుపాయాల కల్పనకు ఆమోదం.
వనపర్తి,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి నియోజకవర్గంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. నియోజకవర్గంలోని తొమ్మిది ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక, ప్రకృతి ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రూ.14 కోట్లతో ప్రతిపాదించిన పనులకు ఆమోదం లభించగా, తొలి విడతగా రూ.10 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు.యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ఈ మేరకు 2026 అక్టోబర్ 19న జీవో ఆర్టీ నంబర్ 313 జారీ చేసినట్లు తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, చెరువులు, రిజర్వాయర్ల సుందరీకరణ, అవసరమైన చోట్ల బోటింగ్ సదుపాయాల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నారు.ప్రతిపాదిత అభివృద్ధి పనుల్లో భాగంగా వనపర్తి పట్టణంలోని తిరుమలయ్య గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం, గోపాల్‌పేట మండలంలోని బుద్దారం ఆలయ అభివృద్ధి, ఖిల్లా ఘణపురం మండలంలోని ఘణప సముద్రం సుందరీకరణతో పాటు బోటింగ్ సదుపాయం కల్పించడం ఉన్నాయి.అలాగే మామిడిమాడ నేరేడు చెరువు, వనపర్తి ఎంటీబీ ప్రాంతం, పెద్దమందడి మండలం వెల్టూర్ లోని వేణుగోపాల సముద్రం, చిన్నగుంటపల్లిలోని గుండ్ల చెరువు, శ్రీరంగాపురంలోని రంగసముద్రం అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. వనపర్తి పట్టణంలోని గ్రంథాలయ హాల్‌ను కల్చరల్ సెంటర్‌గా అభివృద్ధి చేయనున్నారు.నియోజకవర్గంలోని చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. పర్యాటకుల రాక పెరిగితే స్థానికంగా ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది.పర్యాటక అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో వనపర్తి నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాలకు మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు.


Comments